మహాత్మాగాంధీ,
రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహనీయుల ప్రశంసలు
అందుకున్న వ్యక్తి... బ్రిటిష్ పాలన కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ
శాస్త్రవేత్త...రసాయన శాస్త్రానికి ఎనలేని సేవ! నిరాడంబరుడు, మానవతావాది ,
దేశ భక్తుడు, గొప్ప అధ్యాపకుడు,
బహుభాషా కోవిదుడు, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గ్రంథ రచయిత... ప్రఫుల్ల చంద్ర రే. ఆయన పుట్టిన
రోజు -02August1861!.
'యూరప్‌లో జనం జంతు చర్మాలు కట్టుకుని అడవుల్లో తిరుగుతున్న కాలంలోనే భారతదేశంలో అద్భుత రసాయనాలను తయారు చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు' అంటూ తరచు చెప్పే ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, మన దేశం రసాయన శాస్త్ర రంగంలో మరింత ముందంజ వేయడానికి ఎంతో దోహదపడ్డారు. దేశంలో తొలి ఔషధ తయారీ సంస్థను స్థాపించిన వ్యక్తిగా, మెర్క్యురస్ నైట్రేట్‌ను కనుగొన్న పరిశోధకునిగా పేరొందారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, శాంతి స్వరూప్ భట్నగర్ ఆయన శిష్యులే.
పి.సి.రే గా చిరపరిచితుడైన ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న కాలిపరా గ్రామంలో 1861 ఆగస్టు 2న పుట్టారు. సంపన్న కుటుంబంలోనే పుట్టినా ఎదిగే సమయానికి ఆస్తులు పోయి అప్పులు మిగిలిన ఆర్థిక పరిస్థితి. బడిలో చేరినా అనారోగ్యం పాలవడంతో చదవు ఆగిపోయింది. ఇంట్లోనే ఉంటూ కనిపించిన పుస్తకమల్లా చదివిన ప్రఫుల్ల చంద్ర పదేళ్లకల్లా సంస్కృతం, ఇంగ్లిషు, బెంగాలీ, లాటిన్, గ్రీకు భాషా సాహిత్యాన్ని చదివాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ చదివిన స్ఫూర్తితో సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. కలకత్తాలో తిరిగి బడిలో చేరి చురుకైన విద్యార్థిగా పేరొందాడు. లండన్ యూనివర్శిటీ నిర్వహించే పోటీ పరీక్షలో నెగ్గి స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్ వెళ్లి ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ డిగ్రీ పొందాడు. అక్కడే రసాయనాలపై జరిపిన పరిశోధనలకు 27 ఏళ్ల వయసులోనే డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ) సంపాదించాడు.
స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఒకవైపు బోధన, మరో వైపు పరిశోధనలతో కాలం గడిపే ఆయన దృష్టి ఔషధ రంగంపై పడింది. విదేశాల నుంచి వచ్చే మందుల ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేని కారణంగా వాటిని ఇక్కడే తయారు చేయాలని సంకల్పించి 'ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్'ను స్థాపించారు. ఆపై అనేక పరిశ్రమల స్థాపనకు దోహద పడ్డారు. మెర్క్యురస్ నైట్రేట్, బంగారం, ప్లాటినం, ఇరిడియమ్ సమ్మేళనాలపై ఆయన పరిశోధనలు ప్రపంచ గుర్తింపు పొందాయి. ప్రాచీన గ్రంథాలు చదివి 'ద హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ' అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రచించారు. రసాయన శాస్త్రంలో 107 పరిశోధన పత్రాలు వెలువరించారు.
బెంగాల్ వరదల సమయంలో 25 లక్షల రూపాయల విరాళాలను సేకరించిన ప్రఫుల్ల చంద్రరేను మహాత్మాగాంధీ 'డాక్టర్ ఆఫ్ ఫ్లడ్స్' అని ప్రశంసించారు. 1916లో పదవీ విరమణ పొందిన ఆయన యూనివర్శిటీ సైన్స్ కాలేజీలో ప్రొఫసర్‌గా చేరినప్పుడు ఇకపై తన జీతమంతటినీ రసాయన శాస్త్రం అభివృద్ధికే విరాళంగా ఇస్తానని ప్రకటించి ఇరవై ఏళ్లపాటు అలా చేయడం విశేషం. జీవితకాలం బ్రహ్మచారిగా ఉన్న ఆయన ఆ కళాశాలలో ఓ గదిలో కొందరు పేద విద్యార్థులతో పాటు ఉండడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఆయన తన 83వ ఏట 1944లో మరణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి