ఆధునిక రసాయన శాస్త్రానికి ఆద్యుడు
మంట... నీరు... గాలి... వీటి గురించి
కొత్త విషయాలెన్నో చెప్పాడు! ఆధునిక
రసాయన
శాస్త్రానికి పితామహుడుగా గుర్తింపు పొందాడు! ఆయనే
ఆంటోనీ లెవోషియర్...
పుట్టిన రోజు 1743 ఆగస్టు 26న.
మంట అంటే ఏమిటో, దహనంలో జరిగే చర్య ఏమిటో
అప్పటికి తెలీదు. నీరు ఒక మూలకం అనుకునే రోజులవి.
గాలిలో ఏమేమి ఉంటాయో చెప్పలేని స్థితి. వాటిని
పరిశోధించి రసాయన శాస్త్రాన్ని
కొత్త పుంతలు తొక్కించిన
ఫ్రెంచి శాస్త్రవేత్త ఆంటోనీ లెవోషియర్.
పారిస్‌లో 1743 ఆగస్టు 26న సంపన్న కుటుంబంలో
పుట్టిన ఆంటోనీ లారెంట్ డి లెవోషియర్ చిన్నప్పుడే
తల్లిని
కోల్పోయాడు. న్యాయవాది అయిన తండ్రి కోరికపై
న్యాయశాస్త్రాన్ని చదివినా, ఆపై భూగర్భ శాస్త్రంపై దృష్టి
పెట్టాడు. పాతికేళ్లకే ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్
సైన్సెస్‌లో చేరి
డైరెక్టర్‌గా ఎదిగిన ఇతడు, మరో వైపు పన్నులు వసూలు
చేసే కంపెనీని స్థాపించాడు. ఇన్ని వ్యాపకాల మధ్య
కూడా
పరిశోధనలు కొనసాగించడం విశేషం.
అప్పటి సిద్ధాంతాల ప్రకారం మండే వస్తువుల్లో 'ఫోజిస్టాన్'
అనే పదార్థం ఉంటుందని నమ్మేవారు. దహనచర్యలో
భాగంగా వస్తువులు ఆ పదార్థాన్ని
కోల్పోతాయనుకునేవారు. లెవోషియర్ తన ప్రయోగాల
ద్వారా
గాలిలోని ఆక్సిజన్ వల్లనే దహనం
సాధ్యమవుతుందని నిరూపించాడు. అలాగే గాలిలో ఏఏ
వాయువులు కలిసి ఉంటాయో చాటి చెప్పాడు. ఆయనకు
ముందు 2000 సంవత్సరాల నాటి నుంచే నీరనేది ఒక
మూలకమని భావించేవారు. ఆ దశలో హైడ్రోజన్, ఆక్సిజన్
వాయువుల ద్వారా ప్రయోగశాలలో నీటిని తయారు చేసి
లెవోషియర్ సంచలనం
సృష్టించాడు. ఇంకా వజ్రాలనేవి
కార్బన్ యొక్క స్ఫటిక రూపాలేనని నిరూపించాడు.
తూనికలు, కొలతల విషయంలో ఉపయోగపడే మెట్రిక్
పద్ధతి రూపకర్త కూడా ఆయనే. ప్రయోగశాలలో
రసాయన
పదార్థాల చర్యలను,
వాటి ఫలిత పదార్థాలను కచ్చితంగా
కొలవడం
ద్వారా 'ద్రవ్య నిత్యత్వ సూత్రం'
(Law of
Conservation of Mass) ఆవిష్కరణకు
దోహదపడ్డాడు..
దహనచర్యపై తన సిద్ధాంతాన్ని జీవుల
శ్వాసక్రియకు
ఆపాదించడం ద్వారా జీవశాస్త్రంలో కూడా కొత్త వివరాలు
చోటు
చేసుకున్నాయి. ఆయన రచించిన 'ది ఎలిమెంటరీ
ట్రీటైజ్ ఆన్ కెమిస్ట్రీ' ఓ ప్రామాణిక గ్రంథంగా
గుర్తింపు పొందింది.
ఫ్రెంచి విప్లవం తర్వాత అధికారం చేపట్టిన
ప్రభుత్వ
అధికారుల్లో ఒకరు రాసిన రసాయన గ్రంథాన్ని పాఠ్య
పుస్తకంగా
అంగీకరించలేదన్న కక్షతో ఆయనపై తప్పుడు
అభియోగాలు మోపి శిరచ్ఛేద శిక్ష విధించడం ఆ
దేశ
చరిత్రలో ఒక మాయని మచ్చ.
'ఆయన తల తీయించడానికి ఒక క్షణం పట్టింది కానీ,
అలాంటి మరో తల రావాలంటే యుగాలు పడుతుంది' అని
శాస్త్రరంగం నివాళులు పొందిన శాస్త్రవేత్త ఆయన.